Thursday, April 25, 2024

ఏపీ ఉద్యోగుల హెచ్చరిక.. 24న నోటీసు, ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త వేతన సవరణ ఉత్తర్వులను నిరసిస్తూ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రకటించారు. 11వ వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫారసులను అమలు చేయాలంటూ వివిధ ఉద్యోగుల సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తాజా పీఆర్‌సీ (పే రివిజన్ కమిటీ) వేతన స్కేళ్లను వ్యతిరేకిస్తున్నారు. శుక్రవారం అమరావతిలో ‘పీఆర్‌సీ సాధన సమితి’ ఆధ్వర్యంలో పలు ఉద్యోగుల సంఘాల సమావేశం జరిగింది. జనవరి 24న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని ఈ భేటీలో ఉద్యోగుల సంగాలు నిర్ణయం తీసుకున్నాయి.

ప్రభుత్వం వెంటనే జీవో లను ఉపసంహరించుకోవాలని, లేదంటే కనీసం వాటిని నిలుపుదల చేయాలని, లేకుంటే చర్చలకు కూడా వెళ్లబోమని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చేయాలని కోరుతూ పోరాడుతామని అన్నారు. జనవరి 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగుల సంఘాలు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నాయి. 11వ పీఆర్‌సీ సిఫారసుల అమలును ప్రభుత్వం వెనక్కి తీసుకోని పక్షంలో ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణను పాటిస్తామని, ఫిబ్రవరి 7న నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.

ఈ నెల ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన పెంపుదల ప్రకటించింది. అదే సమయంలో పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచింది. అయితే ఈ ఫిట్ మెంట్ తమకు ఆమోదయోగ్యం కాదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement