Tuesday, March 26, 2024

కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌కి సీఎం జగన్‌ విజ్ఞప్తి

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని సీఎం జగన్‌ వివరించారు. పోలవరం ప్రాజెక్ట్‌ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  షెకావత్‌తో సీఎం జగన్‌ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. పోలవరంలో ప్రస్తుతం జరుగుతున్న పనులు, ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం నిర్ణయించుకున్న గడవు, తదితర అంశాలను సీఎం కేంద్ర మంత్రికి వివరించారు.

పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాలని గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ని సీఎం కోరారు. పోలవరం పీపీఏతోపాటు, కేంద్ర జలమండలి సిఫార్సులు, కేంద్ర జలశాఖకు చెందిన సాంకేతిక సలహామండలి అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం రూ. 55,656.87 కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని సీఎం జగన్ కోరారు. 2022 జూన్‌ నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ–పునరావాస పనులను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, వెంటనే ఈ అంచనాలకు ఆమోదం తెలపాలన్నారు. జాతీయ ప్రాజెక్టుల విషయంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం వాటర్‌ సప్లైని కూడా ఇరిగేషన్‌ ప్రాజెక్టులో భాగంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నామని, జాప్యం లేకుండా ఆ నిధులను రీయింబర్స్‌ చేయాలన్నారు. రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్‌ వైజ్‌ ఎలిజిబిలిటీకి పరిమితం చేయవద్దని తెలిపారు. 2013 రైట్‌ టు ఫెయిర్‌ కాంపన్‌సేషన్, ట్రాన్స్‌పరెంటీ ఇన్‌ ల్యాండ్‌ అక్విజిషన్, రీహేబ్‌లిటేషన్‌ సెటిల్‌మెంట్‌ చట్టం ప్రకారం పునరావాస పనులకు రీయింబర్స్‌ చేయాలని సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం తరలించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఇప్పుడు సచివాలయ కార్యకలాపాలు లేవని, ప్రాజెక్టు పర్యవేక్షణ, పరిశీలనకోసం సుదూరంలో ఉన్న హైదరాబాద్‌ నుంచి రావడం కష్టం అవుతోందని, అందుకే పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించాలన్నారు.

అంతకుముందు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి.. పోలవరం ప్రాజెక్టులో స్టాకింగ్‌ పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల్లో చిన్న చిన్న అంశాలు మిగిలిపోయాయని వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఇదీ చదవండి: మాన‌సిక రోగుల‌కు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు?

Advertisement

తాజా వార్తలు

Advertisement