Friday, April 19, 2024

దిశ చట్టం ఆమోదించండి: కేంద్రానికి ఏపీ సీఎం జగన్ లేఖ

దిశ చట్టం ఆమోదించాలంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి శుక్రవారం లేఖ రాశారు. దిశ బిల్లు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.  దిశ కింద తీసుకుంటున్న చర్యలు, అమలుపై సీఎం జగన్‌ శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దిశ బిల్లు ఆమోదం ప్రక్రియ చురుగ్గా సాగేలా కేంద్ర స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను యాక్టివ్‌గా చేయాలని సూచించారు. ఫిర్యాదు చేయడానికి, కేసు పెట్టడానికి మహిళలు ఎవ్వరూ కూడా పోలీస్‌ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకే ఫిర్యాదు చేసేలా చూడాలన్నారు. జీరోఎఫ్‌ఐఆర్‌ అవకాశాన్ని విస్తృతంగా కల్పించాలని ఆదేశించారు. బాధిత మహిళ ఒక గ్రామం నుంచి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడానికి సంకోచించవచ్చు అని అభిప్రాయపడ్డారు. అలాంటి మహిళలు గ్రామాల్లో ఉన్న మహిళా పోలీసుల ద్వారానే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. ఈ ఆలోచనను మరింత అధ్యయనం చేసి మెరుగ్గా తీర్చిదిద్దాలని ఆధికారులకు సూచించారు.

దిశ యాప్‌ల్లో ఉన్న అన్ని ఫీచర్లపైనా మహిళా పోలీసులకు పూర్తిస్థాయి అవగాహన, శిక్షణ కల్పించాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రతి రెండు వారాలకు ఒకసారి జిల్లాకలెక్టర్, ఎస్పీలు సమావేశమై ప్రజాసమస్యలతోపాటు, మహిళల భద్రతపైనా సమీక్ష చేయాలని తెలిపారు.  ఈ సమావేశంలో చర్చించిన అంశాలను ప్రభుత్వానికి పంపించాలని చెప్పారు. పోలీస్‌ స్టేషన్లలో రిసెప్షన్‌ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రిసెప్షన్‌ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా చూడాలన్నారు. దీనిపై ఉన్నతాధికారులు రివ్యూ చేయాలని ఆదేశించారు.

‘దిశ’ ఎలా పనిచేస్తుందన్న దానిపై ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో డిస్‌ప్లే ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. మహిళలపై నేరాలకు సంబంధించిన 18 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలన్నారు. మరోసారి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో దీనికి సంబంధించి మాట్లాడాలన్న సీఎం.. అలాగే బాలలపై నేరాలకు సంబంధించి 19 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.

ఇది కూడా చదవండి: షర్మిల పార్టీ జెండా సిద్ధం.. నిరాడంబరంగానే పార్టీ ఆవిర్భావం!

Advertisement

తాజా వార్తలు

Advertisement