Saturday, April 20, 2024

లోన్‌యాప్‌ దుర్మార్గానికి మరో ప్రాణం బలి.. మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య

అమరావతి, ఆంధ్రప్రభ : లోన్‌యాప్‌ల నిర్వహకుల దుర్మార్గానికి మరో ప్రాణం బలైంది. తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేదని వేధింపులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి విజయవాడలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరానికి చెందిన తంగెళ్ళమూడి రాజేష్‌ అనే వ్యక్తి కొంతకాలం క్రితం లోన్‌యాప్‌లో రుణం తీసుకున్నాడు. ఆర్థిక ఇబ ్బందుల కారణంగా అతడు సరైన సమయానికి డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయాడు. దీంతో లోన్‌ యాప్‌ నిర్వాహకులు రాజేష్‌ని వేధించడం మొదలుపెట్టారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఫోటోలు మార్ఫింగ్‌ చేసి భార్యకి పెడదామని బెదిరించారు.

- Advertisement -

తనకు కొంత సమయం ఇవ్వమని ఎంత వేడుకున్నా వినకుండా రాజేష్‌ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి అతని భార్య రత్నకు పంపించారు. ఆ ఫోటోలను వైరల్‌ చేస్తామని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తానికి గురైన రాజేష్‌ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు భార్యకు ఫోన్‌ చేసి బోరున విలపించాడు. భార్య ఇంటికి వచ్చేసరికి చనిపోయి ఉన్నాడు. కాగా తన భర్త లోన్‌ తీసుకున్న విషయం తనకు తెలియదని, తన మొబైల్‌ నంబర్‌ లోన్‌యాప్‌ నిర్వాహకులకు ఎలా తెలిసిందో తెలీదని, అయతే నిర్వహకులు తనకు పదేపదే కాల్స్‌ చేసి బెదిరించారని పేర్కొంది.

తన భర్త మార్ఫింగ్‌ ఫోటోలు పెట్టి మరీ బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఫోటోలు చూసి తన భర్త తట్టు-కోలేక.. తనకు ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఏడ్చాడని వాపోయింది. తన భర్త చనిపోయిన విషయం చెప్పినా లోన్‌యాప్‌ నిర్వాహకుల నుంచి కాల్స్‌ రావడం ఆగలేదని, ఇప్పటికీ కాల్స్‌ వస్తూనే ఉన్నాయని విలపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement