Thursday, March 28, 2024

హనుమంతుడి జన్మస్థలం తిరుమలే

హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడని టీటీడీ నమ్ముతోందని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. ఆకాశగంగ ప్రాంతాన్ని సుందరీకరించాలని నిర్ణయించామని చెప్పారు. హనుమ జన్మస్థలంపై కొందరు వివాదాస్పదం చేస్తున్నారన్నారు. ఆకాశగంగలో ప్రస్తుతం ఉన్న ఆలయం అలాగానే ఉంటుందని స్పష్టం చేశారు. అంజనాదేవి ఆలయంలో ఎలాంటి మార్పులు చేయమని తెలిపారు.

ఆకాశగంగ సమీపంలోని హనుమాన్‌ జన్మస్థలంలో అభివృద్ధి పనులకు బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అంజనాద్రిలో అభివృద్ధి పనులకి భూమిపూజ కార్యక్రమం చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ఆకాశగంగ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. భక్తులకి సౌకర్యమైన వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. వివాదాల జోలికి తాము వెళ్లడం లేదన్న సుబ్బారెడ్డి.. ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పనిసరిగా ఆకాశగంగ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తేల్చిచెప్పారు.

సీఎం జగన్ హిందూ ధర్మ ప్రచారం పెద్దఎత్తున చెయ్యాలని ఆదేశించారని చెప్పారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో 502 ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. వెనుకబడిన, బలహీన వర్గాలున్న ప్రాంతాలలో ఆలయాలు నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తున్నామని వివరిచారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే నిధులను ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామన్నారు. జమ్మూలో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం నిర్మాణం సంవత్సరంలో పూర్తవుతుందని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement