Saturday, April 20, 2024

Andhra Pradesh: సోలార్‌ పవర్‌ జనరేషన్‌లో టాప్‌.. దేశంలోనే థర్డ్ ప్లేస్..

అమరావతి, ఆంధ్రప్రభ: సోలార్‌ పార్కుల అభివృద్ధికి రూ.580.80 కోట్లు కేటాయించి, దేశంలో అగ్రగామిగా నిలిచిన ఆంద్రప్రదేశ్‌ తాజాగా మరో ఘనత సాధించింది. సౌరవిద్యుత్‌ స్థాపిత సామర్థ్యంలో దేశంలోనే మూడో అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందింది. మెర్కామ్‌ ఇండియా రీసెర్చ్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో 2021 డిసెంబర్‌ చివరి నాటికి క్యుములేటివ్‌ యుటిలిటీ స్కేల్‌ సోలార్‌ ఇన్‌స్టలేషన్‌లు 41.5 గిగావాట్లుగా ఉన్నాయి. డిసెంబర్‌ 2021 నాటికి 8.9 గిగావాట్ల స్థాపిత సామర్థంతో యుటిలిటీ స్కేల్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌లలో రాజస్థాన్‌ అగ్రస్థానంలో నిలచింది. కర్నాటక 7.5 గిగావాట్లతో రెండో స్థానంలో నిలవగా, 4.3 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏపీ మూడో స్థానం దక్కించుకుంది. 4 గిగావాట్ల సామర్థంతో తమిళనాడు 4వ స్థానంలో, 3.9 గిగావాట్లతో ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ 5వ స్థానంలో ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది.

దేశం మొత్తం స్థాపిత సౌర విద్యుత్‌ సామర్ధ్యంలో 10 శాతానికి పైగా వాటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్కించుకుంది. అయితే అంతరించిపోతున్న గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌ పక్షులను రక్షించాల్సిన అవసరంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాజస్థాన్‌లో రాబోయే ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు. ఈ పక్షి కొన్ని పవర్‌ ప్రాజెక్టుల ప్రాంతాలలో నివాసం ఉంటోంది. అందువల్ల అక్కడి ప్రాజెక్టులు ఆలస్యమైతే ఏపీలో ఇటువంటి ప్రాజెక్టులు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

సౌర విద్యుత్‌కు ఏపీ ప్రాధాన్యం..
ఏపీలో జగన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యమిస్తోంది. సోలార్‌ పార్కుల ఏర్పాటుకు అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలిచినట్లు ఇటీవల కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌, కర్నాటక ఉన్నాయి. వ్యవసాయానికి, ఇతర అవసరాలకు నాణ్యమైన సౌర విద్యుత్‌ సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈసీఐ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు విద్యుత్‌ నియంత్రణ మండలి అనుమతి పొందాయి. వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు ఉచిత విద్యుత్తును శాశ్వత పథకంగా మార్చడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రైతులకు పగటిపూట 9 గంటలు విద్యుత్‌ యూనిట్‌ రూ.2.49 పైసలు చొప్పున ఇచ్చేందుకు ఏడాదికి 7 వేల మెగావాట్ల విద్యుత్తును పాతికేళ్ళపాటు కొనుగోలు చేయనుంది. ఈ చర్యతో భవిష్యత్తులో ఏపీ స్థానం మరింత మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement