Thursday, April 25, 2024

Andhra Pradesh – రెండో రోజూ స‌ర్వ‌ర్ల మొరాయింపు – రిజిస్ట్రార్ కార్యాల‌యాల వద్ద ప‌డిగాపులు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సోమవారం సర్వర్లు మొరాయించాయి. దీంతో 295 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు నిలిచిపోయాయి. జూన్‌ 1వ తేదీ నుండి భూముల మార్కెట్‌ విలువలు పెంచి ఆదామాషా ప్రకారం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సోమ‌వారం నాడు ప్రజలు తమ ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు వచ్చిన వారితో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యాలు కిక్కిరిశాయి. ఈక్రమంలోనే ఉదయం 10 గంటల నుండి రిజిస్ట్రేషన్‌ కార్యాల యాలకు చేరుకున్న సిబ్బందికి సర్వర్‌ మొరాయించడంతో ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముందుగా ఈ-కేవైసీ పూర్తిచేసుకున్న తరువాత అవుట్‌పుట్‌ రాకపోవడంతో రిజిస్ట్రేషన్ల సేవలు నిలిచిపోయాయి. దీంతో సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా గంటల తరబడి ప్రజలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల ముందు నడి ఎండలో పడిగాపులు కాయా ల్సి వచ్చింది. సాయంత్రం వరకూ సర్వర్‌ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రజలు నిరాశగా వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, మంగళవారం మధ్యాహ్నానికి ఈ సమస్య పరిష్కారమవుతుందని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండో రోజైన మంగ‌ళ‌వారం సైతం స‌ర్వ‌ర్లు మొరాయిస్తునే ఉన్నాయి.. సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో రిజిస్ట్రేష‌న్ లు నిలిచిపోయాయి.. ఇప్పటికే నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సిబ్బంది నిర్వామంగా ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తున్నారని వారు చెబుతున్నారు .

ఛార్జీల పెంపు భయంతో పెరిగిన రిజిస్ట్రేషన్లు
జూన్‌ 1వ తేదీ నుండి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరుగుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్లు పెద్ద ఎత్తున చేయింకునేందుకు ప్రజలు తరలి వచ్చారు. జూన్‌ 1వ తేదీకి ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉన్నందున ముందురోజే తమ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేసుకుంటే కొంతలో కొతైనా ఆదా అవుతుందన్న ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రజలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పోటెత్తారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా, ముహూర్తాలేవీ పట్టించుకోకుండానే ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున తమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని భావించారు. ఈక్రమంలోనే సోమ, మంగ‌ళ‌వారాల‌లో ఉదయం నుండి రిజిస్ట్రేష్‌ కార్యాలయాల ముందు ప్రజలు పెద్ద ఎత్తున దర్శనమిచ్చారు. అయితే, దీనిపై అవగాహన లేకపోవడంతో ఇదంతా జరిగిందని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖలోని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం మొత్తంగా ఈ ఛార్జీల పెంపు లేదని, కేవలం 20 శాతం ప్రాంతాల్లో మాత్రమే ఈ పెంపు ఉంటుందన్న వాస్తవాన్ని ప్రజలు తెలుసుకోవాలని వారు సూచిస్తున్నారు. కేవలం రిజిస్ట్రేషన్ల మూలంగా సర్వర్లు మోరాయించడం జరగలేదని, సాంకేతిక లోపం వల్లే అలా జరిగిందంటూ వారు స్పష్టం చేస్తున్నారు.

20 శాతం భూములకు 0 – 30 శాతం పెంపు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల్లో కేవలం 20 శాతం భూములకు మాత్రమే ఛార్జీలు పెరగనున్నాయి. వీటికి కూడా 0 నుండి 30 శాతం మేర ఛార్జీలు పెరగనున్నాయి. అయితే, అనంతపురంలో అత్యధికంగా 30 నుండి 50 శాతం వరకూ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరిగే అవకాశముంది. అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని భూములకు ప్రభుత్వ విలువ కంటే 4 నుండి 5 రెట్ల మేర భూముల విలువ ఉందని అధికారులు గుర్తించారు. ఈనేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భూమలు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరగనున్నాయి. ఇప్పుడు పెంచబోతున్న ఛార్జీలు రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఉండే అకాశముంది. రాష్ట్ర పరిపాలనా రాజధానిగా చేయాలని భావిస్తున్న విశాఖలో ఈసారి 10 శాతం మాత్రమే ఛార్జీలు పెరగనున్నట్లు సమాచారం.

కేవలం సాంకేతిక లోపం వల్లే
రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయింది కేవలం సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపమే కారణమని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎం ఉదయ భాస్కర రావు చెప్పారు. ఇబ్బడి ముబ్బడిగా రిజిస్ట్రేషన్లు పెరగడం మూలంగా సర్వర్లు జామ్‌ అయ్యాయన్నది అవాస్తమన్నారు. సహజంగా సర్వర్లలో ఏర్పడే సాంకేతిక లోపం కారణంగా మాత్రమే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. దీనిపై నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్నారని చెప్పారు. నేడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, యథావిధిగా సర్వర్లు పనిచేసే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement