Tuesday, April 23, 2024

ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక గృహాల కేటాయింపు.. ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20 లక్షల 44 వేల గృహాలను కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కేటాయింపులు ఇచ్చినట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేటాయించిన ఇళ్ల వివరాలు, వాటి నిర్మాణంలో, లబ్ధిదారులకు అందజేయడంలో జరిగిన జాప్యానికి గల కారణాలపై సోమవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించగా… కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20 లక్షల 44 వేల గృహాలను ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద కేటాయించగా, వాటిలో 17 లక్షల 4 వేల 366 ఇళ్ల నిర్మాణం చేపట్టగా, అందులో ఇప్పటివరకు 4 లక్షల 86 వేల 5 గృహాల నిర్మాణం పూర్తైందని మంత్రి తెలిపారు.

ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 31 వేల 88 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించగా వాటిలో రూ. 11,755 కోట్ల నిధులను విడుదల చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాకు 41,696, గుంటూరు జిల్లాకు 32,304 విశాఖ జిల్లాకు 30,786, కర్నూలు జిల్లాకు 30.672, కృష్ణా జిల్లాకు 27,872, పశ్చిమ గోదావరి జిల్లాకు 25,488, తూర్పు గోదావరి జిల్లాకు 23,400 గృహాలను కేటాయించినట్టు కేంద్ర మంత్రి వివరించారు. ఇతర జిల్లాలకూ ఇళ్ల కేటాయింపు జరిగిందని కౌశల్ కిషోర్ చెప్పారు. ఈ గృహల్లో చాలా వాటిని రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లుగా ఉపయోగించడం వల్ల లబ్దిదారులకు అందజేయడంలో ఆలస్యం జరిగిందని ఆయన వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement