Friday, March 29, 2024

AP: రామాయపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన.. స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామన్న సీఎం జగన్​

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు అభివృద్ధి పనులను ఏపీ ప్రభుత్వం బుధవారం లాంఛనంగా ప్రారంభించింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్​రెడ్డి శంకుస్థాపన చేశారు. 11,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయనున్నారు.రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులతో ఓడరేవును నిర్మించి మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్లాన్​ చేస్తోంది.

36 నెలల్లో రూ.3,736 కోట్లతో మొదటి దశను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశ కింద నాలుగు బెర్త్ లను అభివృద్ధి చేస్తారు. పోర్టు పూర్తయితే ఇక్కడి నుంచి ఏడాదికి 25 మిలియన్‌ టన్నులు ఎగుమతి, దిగుమతులు చేయొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నెల్లూరు జిల్లా యంత్రాంగం 803 ఎకరాల భూమిని సేకరించి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు (ఏపీఎంబీ)కి అప్పగించింది.

కాగా, నిర్వాసితులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని అన్నారు. పోర్టు వల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. భూమి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన గ్రామస్తులకు, రుణాలు అందించిన బ్యాంకులకు సీఎం జగన్​ కృతజ్ఞతలు తెలిపారు. పోర్టులో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇక.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆరు ఓడరేవులకు అదనంగా నాలుగు కొత్త పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. తొమ్మిది షిప్పింగ్ హార్బర్‌లను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 2019 జనవరి 9న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పోర్టుకు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు ఐదేళ్లుగా చేసిందేమీ లేదని, ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్నికల ముందు హడావిడిగా పోర్టుకు శంకుస్థాపన చేశారని జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

దుగరాజపట్నంలో ఓడరేవు ఏర్పాటు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగమైనప్పటికీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఆ ప్రతిపాదన వాయిదా పడింది. శ్రీహరికోటకు సమీపంలో ఉన్నందున భద్రతా సమస్యలను, అలాగే నేలపట్టు పక్షుల అభయారణ్యం, పులికాట్ సరస్సుకు సంబంధించిన పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని ISRO అభ్యంతరం తెలిపింది. ఇక.. దుగరాజపట్నం సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకంగా లేదని నీతి ఆయోగ్ కూడా భావించింది. దీనికి ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించాలని రాష్ట్రానికి సూచించింది. దీంతో YSR కాంగ్రెస్ ప్రభుత్వం రామాయపట్నంను ఎంచుకుంది. ఫిబ్రవరి 2020లో నాన్-మేజర్ పోర్టును నిర్మించడానికి SPVని ఏర్పాటు చేసింది. ఇప్పటికే కార్గోతో కిక్కిరిసిపోతున్న కృష్ణపట్నం పోర్టుకు కొద్ది దూరంలో రామాయంపట్నం ఓడరేవు రాబోతోంది. కాగా, కృష్ణపట్నం పోర్టును నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ (ఎన్‌ఇసి) నుంచి అదానీ గ్రూప్ గతేడాది టేకోవర్ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement