Friday, March 29, 2024

కేంద్ర ప్ర‌క‌ట‌న‌తో రియ‌ల్ట‌ర్ల‌లో కొత్త ఆశ‌లు

అమరావతి, ఆంధ్రప్రభ: రాజధానిపై కేంద్ర ప్రకటన అమరావతి ప్రాంత రియల్టర్లలో ఆశలు రేకెత్తిస్తోంది. మరికొద్ది రోజుల్లో అమరావతి రాజధానిపై సుప్రీం తీర్పు వెలువడనున్న తరుణంలో..విభజన చట్టం మేరకే అమరావతి రాజధానిగా ఏర్పడిందంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు రాజకీయ పార్టీలు వేర్వేరు భాష్యాలు చెపుతున్నప్పటికీ.. రాజధాని తరలింపు ఉండబోదనే సంకేతాలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో ఆశాభావాన్ని నింపుతోంది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది. గుంటూరు, విజయవాడ మధ్యన వెలగపూడి ప్రాంతంలో ప్రభుత్వం రాజధాని ఏర్పాటు చేయ డంతో పెద్ద ఎత్తున రియల్‌ వ్యాపారం జరిగింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందలాది రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వెలిశాయి. గుంటూరు- విజయవాడ మధ్యన చెన్నై రహదారికి ఇరువైపులా తాడేపల్లి నుంచి మంగళగిరి వరకు పెద్ద ఎత్తున అపార్టుమెంట్లు.. విల్లాల నిర్మాణం చేపట్టారు. రూ.వందల కోట్లు పెట్టుబడులు పెట్టి ఇక్కడ రియల్‌ వ్యాపారం మొదలు పెట్టిన వ్యాపార వేత్తలు మూడు రాజధానుల ప్రకటనతో కుధేలయ్యారు. నిర్మాణ సమయంలోనే విల్లాలు, అపార్టుమెంట్లకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడింది. కొందరు అడ్వాన్సులు కట్టి ఫ్లాట్లు, విల్లాలు బుక్‌ చేసుకున్నారు. మరికొన్ని చోట్ల నిర్మాణం పూర్తయితే మరింత రేటు వస్తుందనే ఆశాభావంతో నిర్మాణదారులు ముందస్తు బుకింగ్‌కు ఇష్టం చూపలేదు. ఇక వెంచర్లలో పెద్ద ఎత్తున అడ్వాన్సులు చెల్లించి ప్లాట్లు బుక్‌ చేసుకున్నారు. వివిధ వర్గాల నుంచి స్పందన పెద్ద ఎత్తున వస్తున్న నేపధ్యంలో..వ్యాపారులు సైతం రైతులతో ఒప్పందం చేసుకొని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేశారు. ఈ క్రమంలో శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మూడు రాజధానుల ప్రకటనతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందనే భరోసా రాని స్థితిలో కేంద్ర ప్రభుత్వ ప్రకటన రియల్‌ వ్యాపారుల్లో కొంత మనోధైర్యాన్ని కలిగిస్తోంది. సుప్రీం తీర్పు కోసం వారు ఆశావాదంతో ఎదురు చూస్తున్నారు.

అర్థాంతరంగా నిర్మాణాల నిలిపివేత
మూడు రాజధానుల ప్రకటనతో ఒక్కసారిగా నిర్మాణాలు మందగించాయి. రాజధాని అనే భావనతో ఆసక్తి చూపిన కొనుగోలుదారులు..ఆ తర్వాత కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరించారు. రాజధానిలో సొంతింటి కల నేరవేర్చుకోవాలనుకున్న వారు సైతం ప్రభుత్వ ప్రకటనతో విరమించుకున్నారు. అప్పటికే పెట్టుబడి పెట్టిన వారు ఏం చేయాలో పాలుపోని స్థితి. వందల కొద్దీ ఫ్లాట్లు కొనుగోలుదారుల లేక వెలవెలబోయాయి. పలువురు రియల్‌ వ్యాపారులు బ్యాంకు రుణాలతో నిర్మాణాలు చేపట్టారు. ఇదే క్రమంలో నిర్మాణాలు కొనసాగిస్తే పరిస్థితి ఏంటనే దానిపై సందేహాలు నెలకొనడంతో ముందుకు వెళ్లలేని స్థితి. బ్యాంకు రుణాలు తీసుకొని నిర్మాణాలు మొదలు పెట్టిన వారు ముందుకు వెళ్లలేక..వెనక్కి రాలేక అడకత్తెరలో పోక చక్క మాదిరి తమ పరిస్థితి ఉందని వాపోతున్నారు. సగానికి సగం రేట్లు తగ్గించి అమ్మకానికి పెట్టినా నిర్మాణాలు పూర్తయిన అపార్టుమెంట్లలో ఫ్లాట్ల కొనుగోలుకు డిమాండ్‌ లేని స్థితి. దీంతో అనేక అపార్టుమెంట్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఆర్థికంగా స్థితిమంతులైన రియల్‌ వ్యాపారులు మాత్రం పెట్టిన పెట్టుబడి వస్తే చాలని ధీమాతో ముందుకెళ్లారు. ఇలాంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వ ప్రకటన వారిలో కొంత ఉపశమనం కలిగించిందని చెప్పొచ్చు.

బీడు భూములను తలపిస్తూ..
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధానికి చేరువలో వేసిన అనేక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు బీడు భూములుగా మారాయి. కనీసం చదును చేసేందుకు సైతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆసక్తి చూపలేదు. ఏదో విధంగా వదిలించుకునేందుకు ఆఫర్లు పెట్టినా కొనుగోలుదారులు ముందుకు రాలేదు. అప్పటికే పెద్ద మొత్తంలో అడ్వాన్సులు చెల్లించి రైతులతో ఒప్పందం చేసుకున్న వారి ఇబ్బందులు వర్ణనాతీతం. అటు రైతులకు పూర్తి మొత్తం చెల్లించలేక..ఇటు కొనుకోలుదారులు రాక ఆర్థికంగా పలు ఇబ్బందులు పడ్డారు. కొందరైతే పోయిందేదో పోయిందంటూ రైతులకు ఇచ్చిన సొమ్ములు వదులుకొని ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. మరికొందరు మంచి రోజుల కోసం రేపు మాపంటూ గడువులు పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు.

ఎక్కడ చూసినా టులెట్‌ బోర్డులే..
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల పరిస్థితికి భిన్నమైన పరిస్థితి విజయవాడ, గుంటూరు పట్టణాల్లోని భవన యజమానులది. అమరావతికి రాజధాని రాకతో పెద్ద ఎత్తున ఇళ్లకు డిమాండ్‌ ఏర్పడింది. అటు ఉద్యోగులు, ఇటు ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు పెద్ద ఎత్తున రాజధానికి తరలి వచ్చారు. దీంతో నివాసాల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఉన్న నివాసాల అద్దెలు ఆకాశాన్నంటాయి. కొందరు యజమానులు బ్యాంకు రుణాలు తీసుకొని అదనపు అంతస్తులు వేసుకున్నారు. అయినప్పటికీ డిమాండ్‌కు తగిన సంఖ్యలో భవనాలు లేక అద్దెలు భారీగా పెంచారు. ఒకానొక దశలో రాష్ట్ర ప్రభుత్వం అద్దెలు పెంచితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్థితి నుంచి అదనపు అంతస్తులు సరే అప్పటి వరకు ఉన్న పోర్షన్లు సైతం ఖాళీ అయ్యాయి. దీంతో ఎక్కడ చూసినా టులెట్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బ్యాంకులు, ప్రైవేటు రుణాలు తీసుకొని ఇళ్లు నిర్మించిన వారు ఇప్పుడు వాటిని తీర్చేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వీరంతా కేంద్ర ప్రకటనతో మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement