Friday, March 29, 2024

అమరావతి ఉద్యమం: వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని సెగ!

ఏపీ రాజధానిగా అమరావతినే ప్రకటించాలంటూ దాదాపు ఏడాదిన్నరగా రాజధాని ప్రాంత రైతులు ఉద్యమం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం విశాఖ నుంచే పరిపాలన సాగించేందుకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర మంత్రులు మాత్రం ఏ క్షణమైనా విశాఖ నుంచే పరిపాలన కొనసాగుతుందంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతుల ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. తుళ్లూరు, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, దొండపాడు, బోరుపాలెం, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ ప్రాంత రైతుల ఆందోళనను పట్టించుకోవడం లేదు. అమరావతి రైతుల ఉద్యమం మొదలై దాదాపు 600 రోజులకు చేరువవుతున్నా నిరసనలు ఆగడం లేదు.

ఈ క్రమంలో రాజధాని ప్రాంతానికి వచ్చే ప్రజా ప్రతినిధులు, మంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం కృష్ణానది కరకట్ట విస్తరణకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారని తెలియడంతో అమరావతి దళిత జేఏసీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, వారిని పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ తగిలింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత నియోజకవర్గానికి వస్తున్న ఎమ్మెల్యేను అనుచరులు ర్యాలీగా తీసుకురావాలని భావించారు. అయితే అదే సమయంలో ఆ పర్యటనను రాజధాని రైతులు అడ్డుకునేందుకు యత్నించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న అసైన్డ్ రైతులను కౌలు, పెన్షన్లు, టిడ్కో గృహాలు కేటాయించాలేదని దళిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఏం సాధించారని రాజధాని గ్రామాల్లో ర్యాలీలు తీస్తారంటూ దళిత రైతులు నిరసన తెలిపారు. అయితే, విషయం తెలుసుకున్న పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి తుళ్లూరు పీఎస్‌ కు తరలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement