Saturday, June 3, 2023

Big Story: ఆమ్యామ్యా ఇచ్చుకో, రిజిస్ట్రేషన్‌ చేసుకో.. ఆగని అనధికార లేఅవుట్ల దందా

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు… అక్రమార్కులకు, ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి రావల్సిన ఈ కాసులు వారి జేబుల్లోకి వెళ్తున్నాయి. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు కళ్లెం వేయాలని నిర్ణయించింది. అక్రమ లేవుట్ల రిజిస్ట్రేషన్లను నిలుపదల చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్‌ చేస్తే వారిని సర్వీసు నుండి తప్పిస్తామని హెచ్చరించింది. అయితే ఈ హెచ్చరికలను కూడా ఆదాయవనరుగా అక్రమార్కులు మార్చేసుకోవడం విశేషం. ఇప్పటికే భారీగా ఉన్న అక్రమ లే అవుట్లను తక్కువ రేట్లకు కొనుగోలు చేసి, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఎన్‌ఓసీ తెచ్చుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. గతంలో కేవలం రియల్టర్లు, అధికారులు ఆమ్యామ్యాలతో అక్రమాలకు పాల్పడితే, ఇప్పుడు వారికి ప్రజాప్రతినిధులు తోడయ్యారన్నమాట. దీంతో అప్పుడూ, ఇప్పుడూ కూడా రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకే చేరుతోంది. ఈ మొత్తం దందాలో రిజిస్ట్రేషన్‌ శాఖలోని కొంతమంది అధికారులు కూడా స#హకరించడంతో వారి పని సులువైంది. ఫలితంగా అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్‌ రాష్ట్రంలో యథావిధిగా కొనసాగుతోంది.

ఫిర్యాదుల వెల్లువ..

- Advertisement -
   

రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో అక్రమ లే అవుట్లను రిజిష్టర్‌ చేయడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇటీవల కాలంలోనూ కొన్నిచోట్ల ఇలాంటివి జరుగుతున్నట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భూముల రీసర్వేపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో సభ్యులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనధికారిక లేఅవుట్లపై సీరియస్‌గా స్పందించారు. మున్సిపల్‌ శాఖాధికారులు ఈ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటి రిజిస్ట్రేషన్లు జరక్కుండా చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌.. డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్ల ద్వారా సబ్‌ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు

10,169 అక్రమ లే అవుట్లు..

రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 10,169 అక్రమ లే అవుట్లు ఉన్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఇది ఆరు నెలల క్రితం నాటి సంఖ్య. ఈ ఆరు నెలల కాలంలో మరో 2 వేల వరకూ అక్రమ లే అవుట్లు పుట్టు కొచ్చి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ లే అవుట్లు వేయడం ద్వారా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పలు రకాల ట్యాక్స్‌లను ఎగవేతకు పాల్పడుతూ తాము మాత్రం కోట్లకు పడగలెత్తడం పరిపాటిగా మారింది. లాండ్‌ డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, బెటర్‌మెంట్‌ ఛార్జీలు వంటి వాటిని చెల్లించకుండా రూ. కోట్లలో పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. ఇక లే అవుట్లలో మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, కరెంటు సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును కూడా ఒక పథకం ప్రకారం ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అక్రమాలన్నింటికీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అడ్డుకట్ట వేసేందుకు గడచిన రెండున్నరేళ్లుగా ఆయన అధికారులతో సమీక్షలు నిర్వహించారు. పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించిన అనంతరం పన్ను ఎగవేత ఎక్కడ జరగుతుందన్న దానిపై ఒక అవగాహనకు వచ్చిన తరువాత సంబంధిత శాఖకు కొన్ని సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఆమేరకు అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్ల నిలిపివేత అంశంగా చెప్పవచ్చు.

అక్రమాలిలా

అక్రమంగా వేసిన లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 20న స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే, ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు రావల్సిన సొమ్మును స్థానిక ప్రజాప్రతినిధుల జేబుల్లోకి పంపడం ద్వారా ఇది సాధ్యం చేస్తున్నారు. ఎక్కడైతే అక్రమ లే అవుట్‌ ఉంటుందో..అ పంచాయతీ పరిధిలో ఎన్‌ఓసీ (నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్‌) తీసుకొచ్చి దానిని పెట్టి అక్రమ లే అవుట్లను రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. వాస్తవంగా అక్రమ లే అవుట్లను సక్రమం చేయించుకుంటే ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం సమకూరుతుంది. కానీ, అక్రమార్కులు తమ తప్పును కప్పి పుచ్చుకునే క్రమంలో మరో తప్పునకు పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించి డీటీసీపీ లే అవుట్లుగా గుర్తింపు పొందితే వారికి మంచి ధరలు వస్తాయి. కానీ, వాటికి వివిధ రకాల పన్నలు చెల్లించాల్సి ఉన్నందున స్థానికంగా ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో బేరాలు కదుర్చుకుని కొద్దిపాటి ఖర్చుతో పెద్దఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

ప్రభుత్వం ఏం చెప్పిందంటే..

అనధికారిక లే అవుట్లను రిజిస్టర్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. డీటీసీపీ (డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) అనుమతిచ్చిన లే అవుట్లలోని ప్లాట్లను మాత్రమే రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది. అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం రిజిస్టర్‌ చేయకూడదనే నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని స్పష్టంగా పేర్కొ న్నారు. ఈ నిబంధనల అమలులో ఉల్లంఘనలు జరిగినట్లు తెలిస్తే తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీఏ నిబంధనల ప్రకారం సర్వీసు నుంచి డిస్మిస్‌ చేస్తామని కూడా పేర్కొన్నారు. డీఐజీలు తమ జిల్లాల్లో లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించాలని, ఎక్కడా ఉల్లంఘనలు జరగకూడదని సూచించారు.ఈ అంశంపై ప్రతి నెలా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

అయినా బేఖాతరు.. ఆగని రిజిస్ట్రేషన్లు..

ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇంత కఠినమైన ఆదేశాలు జారీచేసినప్పటికీ రిజిస్ట్రేషన్‌ శాఖలో మాత్రం అక్రమార్కుల దందా ఆగడం లేదు. ఫిబ్రవరి 20న ప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తే మార్చి 20 నాటికి 13 జిల్లాల పరిధిలో దాదాపు నాలుగు నుండి ఐదు వేల ప్లాట్ల వరకూ రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు తెలుస్తోంది. దీనిపై రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ఈ శాఖలో అనధికారికంగా జరుగుతున్న ఈ తంతును సత్వరమే నిలిపివేస్తే ప్రభుత్వానికి నెలనెలా కోట్లలో ఆదాయం సమకూరుతుందని పలువురు ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. పేపరు మీద మాత్రమే ఉత్తర్వులు ఉండకుండా ఆచరణలో కూడా ఉండేలా చేస్తే ఫలితం ఉంటుందని, ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు మేల్కొని అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపేయాలని, ఎన్‌ ఓ సీల ద్వారి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సూచిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement