Saturday, April 20, 2024

ఉపఎన్నికకు జీవీఎంసీ సిద్ధం.. బరిలో మూడు పార్టీలు

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఈనెల 15న రెండు వార్డులకు సంబంధించి ఉప ఎన్నికల నిర్వహణకు గ్రేటర్‌ అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధం చేస్తుంది. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేసే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ నెల 15న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును సులభతరంగా వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జీవీఎంసీ చేస్తోంది. కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీశ పర్యవేక్షణలో సంబంధిత అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం:

ప్రస్తుతం జీవీఎంసీకి సంబంధించిన 31వ వార్డు, 61వ వార్డుల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు వార్డులకు సంబంధించిన కార్పొరేటర్లు దాడి వెంకట సూర్యకుమారి, వానపల్లి రవికుమార్‌లు కొద్ది నెలల క్రితం మృతి చెందడంతో ఇప్పుడు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అందులో భాగంగానే ఈనెల 15న ఆయా రెండు వార్డులకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయా వార్డుల్లో ఉప ఎన్నికలు తొలుత సులభంగా, ప్రశాంతంగా ముగుస్తాయని అంతా భావించారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపధ్యంలో ఇప్పుడు ఈ ఉప ఎన్నికలను అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోపాటు ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఆయా వార్డుల్లో ఉప ఎన్నిక వాడిగా వేడిగా మారనుంది. 31వ వార్డులో వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 61వ వార్డులో వైసీపీ, జనసేన అభ్యర్ధుల మధ్య పోటీ జరగనుంది.

అయితే రెండు వార్డులను కైవసం చేసుకోవాలని వైసీపీ అధి ష్టానం భావిస్తుంది. అందుకు తగ్గట్లుగానే గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. మరోవైపు 31వ వార్డులో తమదే విజయమని టీడీపీ ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తుంది. ఇందు కోసం ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అంతా కూడా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. మరోవైపు జనసేన కూడా తమ అభ్యర్ధుల గెలుపు కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తుంది. తాజాగా జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన కూడా ముగ్గురు కార్పొరేటర్లను గెలిపించుకోగలిగింది. దీంతో ఇప్పుడు ఈ రెండు వార్డుల్లో కూడా విజయం కోసం ప్రయత్నాలు చేస్తుంది. జనసేన పార్టీ అదిష్టానం ఈ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా కమిటీలను నియమించింది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకర్‌, బొలిశెట్టి సత్యనారాయణ, కోనతాతారావులతో పాటు పలువురికి ఈ కమిటీల్లో పూర్తి బాధ్యతలు అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement