Tuesday, April 16, 2024

Admin Capital – ఆగ‌స్ట్ లోనే జ‌గ‌న్ విశాఖ‌లో మ‌కాం

అమరావతి, ఆంధ్రప్రభ: ఈ ఏడాది ఆగస్టులోనే విశాఖకు మకాం మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి నిర్ణయించారు. ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మాత్రమే తరలించే యోచన లో ఉన్నారు. కార్యాలయానికి అవసరమైన హంగులతో భవనాలు రుషికొండపై రూపు దిద్దుకుంటున్నా అందుకు కొంత వ్యవధి పడుతుందని ఈలోగా రుషికొండకు సమీపం లోని ఓ భవనం సీఎంఓకు అనుకూలంగా ఉంటుందని అధికారులు పరిశీలించారు. విశాఖ నుంచి పాలన వ్యవహారాలను కొనసాగించేందుకు కేంద్ర పెద్దలు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ మూడు రోజులు ఢిల్లి పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు పెద్దలను కలుసుకున్న సంగతి విదితమే. మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే అంశంపై కూడా కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరిపినట్లు తెలియవచ్చింది.

రాజధాని అమరావ తే అంటూ రాష్ట్ర హైకోర్టు గత ఏడాది మార్చి నెల్లో ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌తో పాటు రైతుల వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ జూలై 28వ తేదీకి వాయిదా పడింది. ఈలోగా తాత్కాలిక ముఖ్యమంత్రి కార్యాలయానికి అవసరమైన తుది మెరుగులు దిద్దాలని మౌఖికంగా ఆదేశించినట్లు తెలియవచ్చింది. ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో విశాఖ కు తరలివెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్‌ పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్లు తెలిసింది.

అయితే విద్యాసంవత్సరం వచ్చేనెల నుంచి ప్రారంభం కావటంతో ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉంటుందనే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. సీఎం జగన్‌ మాత్రం ఆరు నూరయినా ఆగస్టులోనే విశాఖకు మకాం మార్చేయోచనలో ఉన్నారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఈ ఏడాది మే, జూన్‌, జూలై, సెప్టెంబర్‌ నెలల్లో పాలనా రాజధాని విశాఖకు తరలిస్తామని ప్రకటిస్తూ వచ్చారు. అయితే సెప్టెంబర్‌ కంటే ఓనెల ముందుగానే ఆగస్టులోనే తరలించేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే వ్యవధి ఉన్న నేపథ్యంలో ఇక పాలనా వ్యవహారాల కు పదును పెట్టటంతో పాటు పార్టీకి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నారు. పాలనా రాజధాని మొత్తంగా తరలించాలంటే ఇప్పట్లో కష్టసాధ్యం కనుక ముందుగా సీఎంఓ మాత్రమే ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు.

అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ తరువాత విశాఖకు తరలించే విషయమై ముందడుుగు వేయాలని ఎప్పటి నుంచో నిర్ణయించారు. ఇటీవలే ఆ ప్రక్రియ పూర్తికావటంతో ఇక వాయిదా లేకుండా విశాఖ నుంచి పాలనా వ్యవహారాలను ప్రారంభించేందుకు కసరత్తు జరుపుతున్నారు. సీఎం జగన్‌ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనే విశ్లేషణలు జరుగుతున్నాయి. ప్ర ధాన ప్రతిపక్షం ఉత్తరాంధ్రపై ఫోకస్‌ పెంచింది. ఈ నేపథ్యంలో ఆలస్యం లేకుండా సీఎంఓ కార్యకలాపాలు నిర్వహించటం ప్రారంంభిస్తే పార్టీకి కూడా ఉపయుక్తంగా ఉంటుందనేది సీఎం జగన్‌ మదిలో మాటగా చెబుతున్నారు. కుదిరితే సీఎంఓ కార్యాలయం తరలించటం లేదా మూడు రోజులు అక్కడ.. మరో మూడు రోజులు తాడేపల్లిలో క్యాంప్‌ కార్యాలయం నుంచి పాలనా వ్యవహారాలను నడిపితే ఎలా ఉంటుందనేది కూడా పరిశీలిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగులు, అధికారులు తరచు విశాఖ వచ్చే అవకాశం ఉండదని సుప్రీం కోర్టు తీర్పు, కేంద్రంతో సంప్రతింపులు పూర్తయిన తరువాత ఒకే విడత పాలనా రాజధానిని అధికారికంగా తరలించటం శ్రేయస్కరమని కూడా భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement