Friday, March 29, 2024

నిందితుడు ఎమ్మెల్సీ, బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు.. అనంతబాబు బెయిల్ పై సుప్రీంలో వాదనలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హత్యకేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర రావు (అనంత బాబు) బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అనంత బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్. ఓకాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణ డిసెంబర్ 12కు వాయిదా వేసింది. కేసు ప్రతివాదుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బాధిత కుటుంబానికి చెందిన వి. నూకరత్నం తరఫున న్యాయవాది కేవియట్ ద్వారా ధర్మాసనం ముందు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేసులో తొలుత పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అనంతబాబును అరెస్టు చేసి 90 రోజులు దాటిపోయిందని తెలిపారు. పోలీసులు దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని చెబుతున్నారని, ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారని వెల్లడించారు. ఆగస్టు 26న ట్రయల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా నిందితుడికి మరో 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలని, ఈలోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెప్పారన్నారు. కానీ ఇప్పటి వరకు చార్జిషీట్ దాఖలు చేయలేకపోయారని అన్నారు. ఈ పరిస్థితుల్లో అనంత బాబు డిఫాల్ట్ బెయిల్ పొందేందుకు అర్హుడని, ఆయనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం వి. నూకరత్నం తరఫున వాదనలు వినిపిస్తూ నిందితుడు అనంత బాబు అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్సీ అని గుర్తుచేశారు. హత్య జరిగిన తర్వాత మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించి, రూ. 2 లక్షలు డబ్బులిచ్చి, ఎక్కడా మాట్లాడొద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. అనంత బాబును అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు జరపాల్సి వచ్చిందని అన్నారు. అలాంటి వ్యక్తికి బెయిలిస్తే కేసులో సాక్షులను, బాధిత కుటుంబాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. ఈ పరిస్థితుల్లో అనంతబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ తామేమీ అనంత బాబును నిర్దోషిగా ప్రకటించడం లేదని, అయితే 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులవుతారని చెప్పింది. ఇప్పటికీ చార్జిషీట్ దాఖలు చేయకుండా రిమాండ్‌లో కొనసాగించడం ఎంతవరకు సమ్మతం అన్నదే చర్చనీయాంశమని తెలిపింది. ఈ పరిస్థితుల్లో తదుపరి విచారణ డిసెంబర్ 12కు వాయిదా వేస్తూ, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement