Saturday, April 20, 2024

పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 5,03,486 దరఖాస్తులు.. ఈ నెల 22న ప్రిలిమినరీ రాత పరీక్ష

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల ఖాళీల నియామకానికి ఐదు లక్షల మూడు వేల 486 దరఖాస్తులు అందినట్లు రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ మనిష్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. గత నవంబర్‌ 28న పోలీసుశాఖలోని ఆరువేల వంద ఖాళీల కానిస్టేబుల్‌ ఉద్యోగాల భార్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో సివిల్‌ పోలీసు కానిస్టేబుల్‌ ఖాళీలు 3,580 ఉండగా ఏపీఎస్పీలో 2,520 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తు దారులకు ఈ నెల 22న ప్రాథమిక రాతపరీక్ష రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడు చేసుకోవాలని ఆయన సూచించారు.

దరఖాస్తుదారుల్లో తెలుగులో రాసేందుకు 3,64,184 మంది దరఖాస్తు చేసుకోగా లక్షా 39వేల 75మంది ఇంగ్లీషు, 227 మంది ఉర్థూలో రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. మొత్తం దరఖాస్తు దారుల్లో పురుష అభ్యర్థులు 3,95, 415 మంది ఉండగా, మహిళా అభ్యర్థులు లక్షా ఎనిమిది వేల 71మంది ఉన్నారు. వీరిలో ఓసీలు 53,778, బసీలు 2,74,567 మంది ఉండగా ఎస్సీలు లక్షా 31వేల 875 మంది, ఎస్టీలు 43వేల 266 మంది ఉన్నారు. వీరిలో పీజీ చదివిన వారు 13,961, డిగ్రీ చదివిన వారు లక్షా 55వేల 537 మంది ఉండగా ఇంటర్‌ చదివిన వారు 2,95,655 మంది, ఇతరులు 36వేల 333మంది దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement