Friday, November 29, 2024

AP | అల్లూరి జిల్లాలో రహదారుల అభివృద్దికి రూ.43 కోట్లు !

సీలేరు, (ఆంధ్రప్రభ): అల్లూరి జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలను చేపడుతున్నట్లు రహదారులు భవనాల శాఖ సీఈ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లాలో పర్యటించిన ఆయన ఆర్‌వినగర్‌ నుంచి పాలగెడ్డ వరకు ఉన్న రహదారిని అధికారుల బృందం పరిశీలించారు. గత సెప్టెంబర్‌ 8న వచ్చిన తుఫానుకు సందర్భంగా కొట్టుకుపోయిన రహదారులు, కల్వర్టలు, వంతెనలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ.43 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయన్నారు. ఇందులో భాగంగా రూ.33 కోట్లతో గూడెం కొత్తవీధి నుంచి పాలగెడ్డ వరకు రహదారి మరమ్మతులు నిర్వహిస్తామని, మరో 10 కోట్లతో రంపచోడవరం డివిజన్‌లో మరమ్మతులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

ఈ పనులకు సంబంధించి నవంబర్‌లో టెండర్లు ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. డిసెంబర్‌ నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. అంతరాష్ట్ర రహదారి విస్తరణకు గతంలోనే సన్నహాలు చేసినప్పటికీ అటవీ అభ్యంతరాలు వలన చేపట్ట లేకపోయమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారుల గుంతలు పూడ్చే పనిని విస్తృతంగా చేపడుతున్నామన్నారు.

సంక్రాంతి కల్లా రోడ్లపై ఉన్న గోతులను పూడ్చడానికి పనులు పూర్తిచేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. ప్రతి జిల్లాలో జరిగే పనుల పనితీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులు కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఆర్‌అండ్‌ బి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బాలసుందర్‌ బాబు, డీఈ అప్పారావు, ఏఈ బర్తడు తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉంటే ఆక్టోబర్‌ 25 వ తేదిన ఆంధ్రప్రభ దినపత్రికలో ”నరకానికి నకళ్ళు, ఆద్యంతం గుంతలు చినుకు పడితే చెరువులే” అనే శీర్షికను ప్రచురించిన వారం రోజుల్లోనే అధికారులు స్పందించి రహదారులను పరీశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement