Friday, March 29, 2024

ఈనెలాఖరుకు 4,134 టీచర్‌ పోస్టుల భర్తీ.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో 5,251 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కొత్త డిఎస్సీ నోటిఫికేషన్‌పై పీడీఎఫ్‌ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పీడీఎఫ్‌ సభ్యుడు, మంత్రికి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెలాఖరులోగా 4,134 టీచర్‌ పోస్టులను 1998 డిఎస్సీ అభ్యర్దులతో భర్తీ చేయనున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే ఇక మిగిలేది కేవలం 717 పోస్టులు మాత్రమేనని స్పష్టం చేశారు. దీనిపై పీడీఎఫ్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేలకు పైగా ఖాళీలు ఉంటే ఇలా సమాధానం చెప్పటం సరికాదని అన్నారు.

రేష న్నలైజేషన్‌ లో భాగంగా ఈ పోస్టులను కూడా కుదించారని విమర్శించారు. అసలు తాము అడిగింది 2019 అనంతరం ఎన్ని డిఎస్సీలు నిర్వహించారో చెప్పాలని దానికి సమాధానం ఇవ్వకుండా పాత డిఎస్సీ నియామకాల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. అసలు డిఎస్సీ నిర్వహించే ఆలోచన ఉందా అని నిలదీశారు. దీనిపై మంత్రి సమాధానం ఇస్తూ పాత డిఎస్సీలకు సంబంధించిన అభ్యర్ధులను ఈ పోస్టుల్లో భర్తీ చేస్తున్నామని ఎలాగైనా ఖాళీల భర్తీ పూర్తి చేస్తున్నట్లే కదా అని అన్నారు. రాష్ట్రంలో 67,147 స్కూల్‌ అసిస్టెంట్లు , 83,495 యస్‌ జీటీ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారని తెలిపారు. ఇంకా ప్రభుత్వం ఇచ్చిన లెక్కలతో సంతృప్తి చెందని పక్షంలో పీడీఎఫ్‌ సభ్యులతో కలిసి క్షేత్రస్ధాయి పరిశీలన చేస్తామని వాస్తవాలను వారికి వివరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

రాష్ట్రంలో 6,755 ఏకోపాధ్యాయ పాఠశాలలు..

రాష్ట్రంలో 6,755 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని మంత్రి బొత్స తెలిపారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ఒకటి నుంచి ఇరవై లోపు విద్యార్ధులు ఉన్న పాఠశాలల్లో సింగిల్‌ టీచర్‌ విధానం కొనసాగుతుందని , అలాగే 21 నుంచి 30 మంది పిల్లలు ఉన్న పాఠశాలల్లో ఇద్దరు టీచర్లను నియమించినట్లు తెలిపారు. జిల్లా, మండల పరిషత్‌ పరిధిలో 6,709 సింగిల్‌ టీచర్‌ పాఠశాలలు ఉండగా మునిసిపల్‌ పరిధిలో మరో 46 ఉన్నాయని చెప్పారు. నూతన విద్యావిధానం పాల సీ కి అనుగుణంగానే నిర్ణయాలు తీసకున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement