Saturday, December 7, 2024

Simhadri: అప్పన్న నిత్య అన్నదానానికి 36 వసంతాలు…

నిరాటంకంగా సాగుతున్న కార్యక్రమం
నాణ్యమైన భోజనంతో భక్తుల మన్ననలను పొందుతున్న అధికారులు
పులిహోర ప్రసాదం ఇక్కడ ప్రత్యేకత

విశాఖపట్నం, ఆగస్టు 14 : భక్తుల కొంగుబంగారం, చల్లని దేవుడిగా పూజలు అందుకుంటున్న దేవుడు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి. నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ప్రకృతి రమణీయత మధ్య వెలసిన ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. విజయనగరం పూసపాటి వంశీయులు ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలు. ఇంత ప్రత్యేక గుర్తింపు పొందిన సింహాచలంలో నిత్య అన్నదానం 35 వసంతాలు పూర్తి చేసుకుంది. 36వ వసంతంలోకి అడుగు పెట్టింది. సరిగ్గా 1989 ఆగస్టు 14లో స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అప్పటి ఆలయ ఉద్యోగులు కేవలం 50వేల రూపాయలతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు దినదిన ప్రవర్తమానమై కొన్ని కోట్ల రూపాయల మూలధనంతో ఈ నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఎంతో ముందు చూపుతో చేపట్టిన ఈ కార్యక్రమం భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేయడంతో పాటు ఆకలిని తీరుస్తోంది. కొండపై నిత్య అన్నదానానికి పెద్ద భవనాన్ని కూడా నిర్మించారు. నిత్యం కొన్ని వేల మందికి నిత్య అన్నదానం కార్యక్రమంలో స్వామి వారి అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ ఆలయానికి ఉత్త‌రాంధ్రులు ఎక్కువగా వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఒరిస్సాలోని నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని కనీసం మూడు రోజులు ఇక్కడే నివాసం ఉండడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు స్వామివారి సేవలో కూడా దాసుడు అనే భక్తుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఆలయంలో వంశపారంపర్య ధర్మకర్త తదుపరి ప్రాధాన్యత ఈ ఒరిస్సా కి చెందిన దాసుడుదే.

అధునాతన పరికరాలతో నిత్య అన్నదాన సత్రం…
భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అన్నప్రసాదాన్ని అందజేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నాడు కర్రలతో వంట చేసే ప్రక్రియ నుంచి నేడు పెద్ద పెద్ద స్టీల్ అండాలు ఆధునిక యంత్రాలతో ఆహారాన్ని తయారు చేస్తున్నారు. అయితే భోజన నాణ్యతలో మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు అన్న విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇందుకు తగ్గట్టుగానే అన్నప్రసాదాన్ని కూడా అధికారులు సిద్ధం చేసి ఉంచుతారు.

- Advertisement -

చందనోత్సవం.. గిరిప్రదక్షిణ కీలక ఘట్టాలు..
సింహాద్రి అప్పన్నకు ప్రతిఏటా నిర్వహించే చందనోత్సవం గిరిప్రదక్షిణ కీలక ఘట్టాలు. లక్షల మంది భక్తులు ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సింహగిరికి చేరుకుంటారు. అలాంటి నేపథ్యంలో కూడా వారికి స్వామి వారి ప్రసాదం నిత్య అన్నదానం పంపిణీలు అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ఇటీవల జిల్లాలో డీఆర్ఓ జిల్లా రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహించిన శ్రీనివాసమూర్తిని సింహాచలం దేవస్థానం కార్యనిర్వాహణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ శాఖలో అపార అనుభవం ఉన్న శ్రీనివాస మూర్తి మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ భక్తుల మన్ననలను పొందారు. ఇటీవల నిర్వహించిన గిరిప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించడంలో సిబ్బందితో పాటు ఆయన కీలక పాత్ర పోషించారు.

ఇక్కడి పులిహోరకు ప్రత్యేక గుర్తింపు…
సింహాద్రి అప్పన్న ప్రసాదంలో పులిహోరకు అత్యంత ప్రాధాన్యత ఉంది. తగిన ద్రవ్యాలతో తయారుచేసిన పులిహోర తింటే అదరహో అనాల్సిందే. ఉప్పు పులుపు ఘాటు విలితమై తయారు చేసే ఈ పులిహోరకు భక్తులు దాసోహం అంటారు. సింహాచలం వెళ్ళామని.. చెబితే పులిహోర తెచ్చావా అనేవారు ఎక్కువమంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement