Monday, December 9, 2024

మాయమాటలతో బాలికను లోబర్చుకున్న యువకుడికి 20 ఏళ్ల జైలు.. ఫోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు

ఇబ్రహీంపట్నం, (ప్రభ న్యూస్): మాయ మాటలతో బాలికను లోబర్చుకున్న నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ విజయవాడ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి డాక్టర్ ఎస్.రజిని సోమవారం సంచలన తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంటున్న బాలికను ఇదే ప్రాంతానికి చెందిన తన్నీరు నాగార్జున పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి 2017 ఏప్రిల్ 28వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తన ఇంటికి తీసుకెళ్లాడు. కుమార్తె కనబడకపోవడంతో తండ్రి చుట్టుపక్కల వెతికి నాగార్జున వద్ద కలిసి ఉండటాన్ని గుర్తించి ఇంటికి తీసుకెళ్లి విచారించాడు.

పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో బాలికను పలుమార్లు లోబర్చుకోవడమే కాకుండా ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. దీంతో తండ్రి కుమార్తెను తీసుకెళ్లి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి చార్జిషీట్ దాఖలు చేశారు. పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా చొరవతో ఫోక్సో కోర్టు (స్పీడ్ ట్రయిల్ కోర్టు)లో కేసు త్వరితగతిన విచారించారు.

నిందితుడిపై నేరం రుజువు కావడంతో విజయవాడ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి రజిని నిందితుడు నాగార్జునకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు చెప్పారు. అంతేకాకుండా బాధిత బాలికకు రూ.4 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సర్వీస్ అథారిటీని ఆదేశించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వి.నారాయణరెడ్డి, సీఎంఎస్ ఇన్ స్పెక్టర్, సిబ్బంది పర్యవేక్షణ లో 11 మంది సాక్షులను విచారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement