Thursday, April 25, 2024

16.22 శాతం పెరిగిన వృద్ధి రేటు! సామాజిక ఆర్ధిక సర్వే నివేదికలో వెల్లడి

అమరావతి, ఆంధ్రప్రభ: సామాజిక-ఆర్ధిక సర్వే నివేదికను ముఖ్యమంత్రి వైయస్‌జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక వృద్ధి ఆశాజనకంగా ఉందని సర్వే తెలిపింది. గత ఆర్దిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వృద్ధిరేటు 16.22 శాతం పెరిగినట్లు సర్వే చెబుతోంది. ఇందులో వ్యవసాయ సంబంధిత రంగాల్లో 13.18 శాతం వృద్ధిరేటు పెరిగింది. అలాగే పారిశ్రామిక రంగంలో 16.36 శాతం వృద్ధి రేటు పెరుగుదల నమోదైంది. సేవారంగంలోనూ 18.91 శాతం వృద్ధిరేటు పెరుగుదల నమోదైంది. మరోవైపు గత ఆర్దిక సంవత్సరంతో పోలిస్తే రూ.26,931 మేర తలసరి ఆదాయం కూడా పెరిగినట్లు సామాజిక-ఆర్ధిక సర్వే చెబుతోంది.

- Advertisement -

ఇదే కాలంలో జాతీయ స్ధాయిలో గత ఆర్దిక సంవత్సరంతో పోలిస్తే రూ.23,476 మాత్రమే జాతీయ తలసరి ఆదాయం పెరిగింది. మూడేళ్లలో నవరత్నాల ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.1.97 లక్షల కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. సుస్దిరాభివృద్ధి లక్ష్యాల సూచీతో నవరత్నాల్ని అనుసంధానించినట్లు సర్వే నివేదిక వెల్లడించింది. ఈసారి బడ్జెట్‌ కూడా సుస్ధిరాభివృద్ధి లక్షాల సూచీతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నమోదైన వృద్ధిరేటులో వ్యవసాయ రంగం 36.19 శాతం, పారిశ్రామిక రంగం 23.36 శాతం, సేవారంగం 40.45 శాతం వాటా కలిగిఉన్నట్లు ప్రభుత్వం సర్వేలో తెలిపింది.

అలాగే గత మూడేళ్లలో నవరత్నాల ద్వారా వివిధ సంక్షేమ పథకాలకు చేసిన కేటాయింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా పంపిణీ చేసిన మొత్తాల్ని కూడా విద్య, వైద్యం, ఆరోగ్యం, రైతులు, సంక్షేమ రంగాల వారీగా వివరించారు. జిల్లాల విభజన, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధ, భూముల రీసర్వే, స్పందన వంటి కార్యక్రమాల ద్వారా సుపరిపాలన అమలుచేస్తున్నట్లు సర్వేలో ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement