Friday, March 29, 2024

రాజమండ్రి సెంట్రల్ జైలుకు దేవినేని ఉమ!

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు కృష్ణా జిల్లా మైలవరం జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దేవినేనిని రాజమహేంద్రవరం జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ జంక్షన్ నుంచి జూమ్ ద్వారా జడ్జి ఎదుట దేవినేనిని పోలీసులు హాజరుపరిచారు.  అంతకు ముందు ఉమాను..కృష్ణా జిల్లా నందివాడ పోలీస్‌ స్టేషన్ నుంచి భారీ భద్రత మధ్య హనుమాన్‌ జంక్షన్ తరలించారు. దేవినేనిని అరెస్టు చేసిన అనంతరం..ఉదయం 6 గంటలకు నందివాడ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి నందివాడలో హై అలర్ట్ నెలకొంది. దేవినేని ఉమాతో స్టేషన్ నుంచి బయలుదేరిన పోలీస్ కాన్వాయ్‌ను..అడ్డుకునేందుకు తెదేపా శ్రేణులు యత్నించారు. అయితే భారీగా మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. భారీ బందోబస్తు మధ్య..ఆయనను కోర్టుకు తరలించారు.

కాగా, మంగళవారం రాత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఆరోపణలపై నిన్న రాత్రి ఆయన పరిశీలనకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో జి.కొండూరు మండలం గడ్డమణుగ వద్ద ఆయనను కొందరు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. అయితే కావాలనే దేవినేని ఉమ అలజడి సృష్టించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దేవినేని ఉమపై మొత్తంగా 12 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 158, 147, 148, 341, 323, 324, 307, 427, 506, 353, 332, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: దేవినేని ఉమపై అట్రాసిటీ కేసు

Advertisement

తాజా వార్తలు

Advertisement