Friday, April 19, 2024

మళ్లీ జగనే సీఎం.. చంద్రబాబుపై విశ్వాసం లేదు

టీడీపీ అధినేత చంద్రబాబుపై తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి.. అక్కసుతోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జనాగ్రహ దీక్షలో భాగంగా తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉదయం వైఎస్సార్ సీపీ శ్రేణులు వినూత్న నిరసన నిర్వహించారు. చంద్రబాబు దిష్టి బొమ్మను పాడి పై పెట్టి,  డప్పు వాయిద్యాల మధ్య అంతిమ యాత్ర నిర్వహించారు. లోకేష్ వేషధారణలో ఉన్న కార్యకర్తతో దిష్టి బొమ్మకు నిప్పు అంటించి, అంతిమ సంస్కారాలు చేపట్టారు. కార్యకర్తలు బై బై బాబు అంటూ అరిచారు.

ఈ జనాగ్రహ దీక్షల్లో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షనేత చంద్రబాబు విధానాలను ఎండగట్టారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల లబ్ది పొందుతున్న పేద ప్రజలంతా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మళ్లీ ఓట్లు వేసి,  మరోసారి అధికారంలోకి తీసుకొస్తారన్న అక్కసు, భయంతో చంద్రబాబు విచక్షణ కూడా కోల్పోయారని దుయ్యబట్టారు. ఈ కారణంచేతే ఇష్టమొచ్చినట్టుగా ముఖ్యమంత్రి మీద,  రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలను చేపట్టారని భూమన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార ప్రతినిధి పట్టాభి అత్యంత నీచంగా, సభ్య సమాజం తల దించుకునే విధంగా మాట్లాడారని ఆక్షేపించారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలకు వ్యతిరేకంగా జగన్ మోహన్ రెడ్డి అభిమానులు లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారని పేర్కొన్నారు.

మత్తు పదార్థాలను ఉక్కు పాదాలతో అణగదొక్కలని ముఖ్యమంత్రి చెబుతుంటే… తెలుగుదేశం నాయకులు వక్రభాష్యం చెబుతున్నారని దుయ్యబట్టారు. ఏ ఒక్కరు కూడా మద్యానికి బానిసలు కాకూడదని, గంజాయి వంటి  మత్తుకు బానిసలు కాకూడదని ఐదు నెలల కిందటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తిరుపతి నగర పాలక సంస్థ కౌన్సిల్ లో కూడా తీర్మానించిన విషయాన్ని భూమన గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1.21 లక్షల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజల గుండెల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్లపైకి తరలి వచ్చారన్నారు. చంద్రబాబుపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో పూర్తిగా మురిగిపోయిన సరుకుగా చంద్రబాబు మారిపోయారని భూమన ఎద్దేవా చేశారు. ప్రజలంతా వైఎస్  జగన్ నే నమ్ముతున్నారన్న భూమన.. భవిష్యత్తులో కూడా జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి: ‘మా’ ఎన్నికల వివాదం: ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే..

Advertisement

తాజా వార్తలు

Advertisement