Tuesday, April 23, 2024

నూతన విద్యావిధానంతో విద్యార్థులకు మేలు: సీఎం

నూతన విద్యావిధానం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎనలేని మేలు జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇప్పటివారికే కాదు తర్వాతి తరాలకు కూడా విశేష ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు–నేడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై సమీక్షించిన సీఎం.. నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, దీని కోసం అయ్యే ఖర్చుతో వివరాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నూతన విద్యా విధానంవల్ల జరిగే మేలును వివరించాలన్నారు. ఉపాధ్యాయుల్లో, ఇతర భాగస్వాముల్లో అవగాహన, చైతన్యం కలిగించాలని సీఎం సూచించారు.మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్‌ కాలేజీలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు-నేడు కింద భూమి కొనుగోలు, వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్‌ దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

స్కూళ్లు,అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని, ఒక్క సెంటర్‌ను కూడా మూసివేయడం లేదని సీఎం తెలిపారు. రెండు రకాల స్కూళ్లు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. పీపీ1, పీపీ2, ప్రీపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒకటిగానూ ఉంటారన్న సీఎం… వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు వీరికి స్కూలు ఉంటుందని వివరించారు.  మిగిలిన తరగతులు అంటే.. 3 నుంచి10 వ తరగతి వరకూ సమీపంలోనే ఉన్న హైస్కూల్‌ పరిధిలోకి తీసుకురావాలని, ఆ స్కూలు కూడా కేవలం 3 కి.మీ పరిధిలో ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement