Sunday, November 28, 2021

జగనన్న విద్యాదీవెన సొమ్ములు జమ.. చదువులతోనే పేదరిక నిర్మూలన: సీఎం జగన్

పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని ప్రతి అడుగులోను విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రతీ ఒక్కరూ బాగా చదువుకోవాలనేది తన తాపత్రాయం చెప్పారు. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్మును సీఎం జగన్‌ గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తల్లిదండ్రులకు భారం లేకుండా విద్యాదీవెన అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి పేద విద్యార్థికి చదువు అందుబాటులోకి రావాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల భవిష్యత్తు కోసం 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో చదువురాని వారు 2011 లెక్కల ప్రకారం 33శాతం మంది ఉన్నారన్న సీఎం.. దేశంలో సగటు చూస్తే వీరు 27శాతం మంది ఉన్నారని చెప్పారు. దేశం కన్నా రాష్ట్రం ఇంకా తక్కువ స్ధానంలో ఉందన్నారు. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు ఇంటర్‌ పూర్తైన తర్వాత ఎంతమంది కాలేజీలకు వెళ్తున్నారని చూస్తే.. ఆశ్చర్యకరమైన నంబర్లు కనిపిస్తున్నాయని అన్నారు. మనం బ్రిక్స్‌ దేశాలతో పోల్చిచూసుకుంటామని, ఇవన్నీ ఒకేరకమైన ఎకానమీ ఉన్న దేశాలు అని చెప్పారు. బ్రెజిల్‌లో దాదాపు 51.8 శాతం, రష్యాలో 83.4 శాతం, చైనాలో 54.7 శాతం పిల్లలు చేరుతున్నారు. మన దేశంలో కేవలం 27శాతం మాత్రమే కాలేజీలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. దాదాపు 73 శాతం మంది పిల్లలకు ఇంటర్మీడియట్‌ అయిన తర్వాత కాలేజీల్లో చేరడంలేదన్నారు. పిల్లలుపై చదువులు చదవకపోతే, పై స్ధాయి ఉద్యోగాలు సాధించలేకపోతే పేదరికాన్ని ఎప్పుడూ తీసేయలేమని అభిప్రాయపడ్డారు.

పెద్ద చదువులు పిల్లలకు అందుబాటులోకి రావాలన్నారు. ఆ చదువులు కోసం తల్లిదండ్రులు అప్పులు పాలు కాకుండా, అవి పిల్లలకు అందుబాటులోకి వచ్చినప్పుడే వారి తలరాతలు మారుతాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తన తండ్రి వైఎస్ఆర్ ఫీజు రియింబర్స్‌మెంట్‌ విషయంలో ఒక అడుగు ముందుకేస్తే.. జగన్‌ అనే నేను నాలుగు అడుగులు ముందుకు వేశానని చెప్పారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలలో ప్రతి పేదవాడికి, ఓసీల్లో ఉన్న పేద పిల్లలకు పూర్తిగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇస్తున్నామన్నారు.

‘’తల్లితండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితిని మారుస్తున్నాం అంతేకాక హాస్టల్‌ ఖర్చుల కోసం సంవత్సరానికి రూ.20వేలు ఇస్తున్నాం. వసతి ఖర్చులకోసం తల్లిదండ్రులు అప్పులు పాలు కాకూడదని కూడా మేం ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. వసతి దీవెన కింద ఈ డబ్బు ఇస్తున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఫీజు రియింబర్స్‌మెంట్, వసతి దీవెన కోసం ఇంతగా ఖర్చు చేస్తున్నాం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్,మెడిసిన్‌ చదువుతున్న పిల్లలకు పూర్తిగా నూరుశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా బకాయిలు లేకుండా, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రతి త్రైమాసికానికి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నాం.. విద్యారంగంలో ఇప్పటివరకూ మనం చేసిన ఖర్చు ఈ రెండు సంవత్సరాల కాలంలోనే జగనన్న అమ్మ ఒడి ద్వారా 44,48,865 మంది తల్లులకు రూ.13,022 కోట్ల రూపాయలు జమచేశాం. జగనన్న విద్యాదీవెన ద్వారా  18,80,934 మందికి రూ. 5,573 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మందికి రూ. 2,270 కోట్ల రూపాయలు, జగనన్న గోరుముద్దద్వారా రూ. 36,88,618 మందికి రూ.1600 కోట్లు, జగనన్న విద్యాకానుక ద్వారా 45 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా, రూ.650 కోట్ల రూపాయలు, మనబడి నాడు – నేడు కింద తొలిదశలో 15,205 స్కూళ్లల్లో రూ. 3564 కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధికోసం ఖర్చుచేశాం. మొత్తంగా 1,62,75,373 మందికి 26,677.82 కోట్లు విద్యారంగం మీదనే ఖర్చు చేశాం. వసతి దీవెన మొదటి విడత ఏప్రిల్‌లో ఇచ్చాం, మళ్లీ డిసెంబర్‌లో రెండో విడత ఇస్తాం. వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న వారికి రూ.20వేల రూపాయలు వసతి, భోజనం కోసం ఇస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన రెండు కార్యక్రమాలతో పిల్లలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News