Friday, April 19, 2024

అనవసర దిగుమతులపై సుంకాల పెంపు? వాణిజ్యలోటు తగ్గింపునకు ఇదే పరిష్కారం

ఎగుమతుల మందగమనం, వాణిజ్య లోటు పెరుగుదల వంటి ఆందోళనల నేపథ్యంలో కేంద్రం కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతోంది. నిత్యావసరాల జాబితాకు వెలుపల ఉన్న వస్తువుల దిగుమతులపై సుంకాలను పెంచాలని యోచిస్తోంది. అనేక మంత్రిత్వ శాఖలు సుంకాల పెంపు కోసం వస్తువుల జాబితాను షార్ట్‌లిస్ట్‌ చేసే ప్రక్రియలో ఉన్నాయి. దేశంలో తగినంత ఉత్పాదక సామర్థ్యం ఉన్న వస్తువులకు మాత్రమే జాబితా పరిమితం చేయబడుతుందని కేంద్ర వాణిజ్యశాఖ అదనపు కార్యదర్శి సత్య శ్రీనివాస్‌ తెలిపారు. ఈ తరహా దిగుమతులను నివారించ గలిగితే, వాణిజ్య లోటు దిగొస్తుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు వాణిజ్యలోటు 198 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. కిందటేడాది ఇదే కాలంలో వాణిజ్యలోటు 115 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. గతేడాది అసాధారణ స్థాయిలో ఎగుమతులు పెరిగినందున, ఆ బేస్‌ ప్రభావం ఈ ఏడాది పెద్దగా లేదనే అభిప్రాయం వ్యక్తంచేశారు. అన్ని శాఖలకు నెలవారీగా దిగుమతులు పెరుగుతున్న సమాచారాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు.

స్థానికంగా తయారీని పెంచాలన్నదే ఇందులో వ్యూహమన్నారు. అంతర్జాతీయంగా మాంద్యం మనం దేశ ఎగుమతులపై ప్రభావం చూపింది. కానీ, దేశీయ వినియోగ డిమాండ్‌ బలంగా ఉండటంతో దిగుమతులు పెరుగుతున్నాయని, దీంతో వాణిజ్య లోటు విషయంలో ఒత్తిడి నెలకొందని వివరించారు. సుంకాలు విధించడం కోసం అదే హార్మోనైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ నోమెన్‌క్లేచర్‌ కోడ్‌ కింద వచ్చే వస్తువులను వేరు చేయడానికి కూడా ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. ఎల్‌ఈడీ లైట్ల విషయంలో, ప్రభుత్వం సింగిల్‌-వైర్‌ ఎల్‌ఈడీ లైట్‌కు మాత్రమే అధిక సుంకాన్ని విధించే అవకాశం ఉంది. మిగతా వాటిపై ప్రభావం ఉండదు. 2022 బడ్జెట్‌లో ఇయర్‌ఫోన్‌లు, లౌడ్‌స్పీకర్‌లు, స్మార్ట్‌ మీటర్ల వంటి ఇతర వస్తువులపై సుంకాలు పెంచబడినప్పుడు చివరిసారిగా ప్రధాన దిగుమతి సుంకం పెంచడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement